మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

 

చేనేతలకు దక్కిన గౌరవం
ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్‌ సినీ తారలకు డిజైన్లు అందించినా, ఒక కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పూర్తి సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్‌అశ్విన్‌లు మాకు అవకాశం ఇవ్వడం, తొలిసారిగా పూర్తి స్థాయిలో మా సృజనాత్మకతను వెండితెరపై ఆవిష్కరించగలగడం.. అది కూడా సావిత్రి వంటి మహానటి బయోపిక్‌కు డిజైన్‌ వర్క్‌ చేయడం.. దీనికి జాతీయ అవార్డు లభించడం.. అన్నీ అద్భుతాలే. ఇది అనూహ్యమైన అనుభూతి. – గౌరంగ్‌ షా,ఫ్యాషన్‌ డిజైనర్‌

ఏడాదిన్నర కృషి ఫలితం..
అలనాటి సావిత్రి దుస్తులన్నీ సింప్లిసిటీకి, హుందాకు ప్రతీకలుగా అనిపిస్తాయి. అందుకే ఆమె లుక్‌ గురించి పరిశోధనలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దలతో కూడా సంప్రదించారు గౌరంగ్‌. అలనాటి టెక్స్‌టైల్స్‌ పునఃసృష్టి కోసం తరచూ మ్యూజియంలను కూడా ఆయన బృందం సందర్శించింది. నాటి టెక్స్‌టైల్, డిజైన్, టెక్చర్, కలర్‌లలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం నేత కళాకారులకు మార్గదర్శకత్వం వహించింది. ఆర్నెళ్లకుపైగా రీసెర్చ్, ఏడాదిపైగా వీవింగ్‌కు, టెక్చరింగ్, కలరింగ్‌లకు కేటాయించాల్సి వచ్చింది. నటి సావిత్రి నిజజీవిత ఆహార్యాన్ని తెరపై మెరిపించేందుకు తీవ్రంగా శ్రమించాం అంటున్న గౌరంగ్‌.. కనీసం 100కిపైగా చేనేత కళాకారులు నిర్విరామంగా ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్‌ కోసం పని చేశారన్నారు. మొత్తంగా ఏడాదిన్నర సమయం వెచ్చించామన్నారు. దేశంలోని కాంచీపురం, బెనారస్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ పట్టు ఫ్యాబ్రిక్స్‌ను సేకరించి కోట, మంగళగిరి, బ్లాక్‌ ప్రింట్స్‌లతో లూమ్స్‌లో అదనపు సొబగులు అద్దారు.

శ్రద్ధగా.. భక్తిగా..
నాటి మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆనాటి రంగులతో వీటిని బ్యాలెన్స్‌ చేశారు. చిన్నతనం నుంచి చివరి దశ దాకా ఆమె జీవన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణను తీర్చిదిద్దారు. ఎదిగే వయసులోని సావిత్రి కోసం మంగళగిరి, కోటా ప్రింట్స్‌ను స్వర్ణయుగంలాంటి సినీ దశ కోసం హెవీ బ్రొకేడ్స్, సిల్క్స్, ఆర్గంజా, చేతితో నేసిన శాటిన్స్, షిఫాన్స్‌లను వినియోగించారు. అలాగే చరమాంకానికి తగ్గట్టూ ఏర్చికూర్చారు. ‘సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం నన్ను శాటిన్స్‌ను అందించమన్నారు. ఆమె లుక్స్‌ పూర్తిగా స్వచ్ఛమైన చేనేతలతోనే ఉండాలని కోరుకున్నాను. భారీ కాంజీవరమ్‌ లెహంగా, బ్లౌజ్, ఆర్గంజా దుపట్టాతో ఉండే ‘మాయాబజార్‌’లోని సావిత్రి లుక్‌ కోసం 3 నెలలు పట్టింది’ అని చెప్పారు గౌరంగ్‌ షా.

Leave A Comment